జగన్‌పై దాడి నిందితుడు శ్రీనివాస్‌కు రిమాండ్‌ పొడిగింపు

విశాఖ: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో నిందితుడు జె.శ్రీనివాస్‌ సిట్‌ విచారణ ఆరో రోజు ముగిసింది. భారీ భద్రత మధ్య అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కస్టడీని పొడిగించాలని సిట్‌ అధికారులు కోరడంతో.. న్యాయమూర్తి నిందితుడి రిమాండ్‌ గడువును ఈ నెల 9వరకు పొడిగించారు. అనంతరం శ్రీనివాస్‌ను పోలీసులు కేంద్ర కారాగారానికి తరలించారు. జగన్‌పై దాడి కేసులో శ్రీనివాసరావుకు విధించిన పోలీస్‌ కస్టడీ నేటితో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు నిందితుడి కాల్‌డేటా ఆధారంగా పోలీసు విచారణ కొనసాగింది. కేసుకు బలమైన ఫోరెన్సిక్‌ నివేదిక ఇంకా అందకపోవడంతో ఈ కేసులో ఆశించిన పురోగతి సాధించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిందితుడికి కస్టడీ పొడిగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరడంతో న్యాయస్థానం నిందితుడి రిమాండ్‌ గడువును పొడిగించింది.

ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడు, సహచర సిబ్బందిని పోలీసులు విచారించారు. ఈ నిందితుడితో సంబంధాలున్న పలువురిని అనేక కోణాల్లో ప్రశ్నించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 100 మందిని విచారించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌ తల్లిదండ్రులు తాతారావు, సావిత్రమ్మను గురువారం సిట్‌ బృందం విచారించింది. విశాఖ విమానాశ్రయం పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులను చూసిన నిందితుడు నోరు విప్పలేదు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం దాడి సమయంలో జగన్‌ వేసుకున్న చొక్కాను న్యాయస్థానం ద్వారా పొందాలని పోలీసులు భావిస్తున్నారు. విమానాశ్రయంలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇప్పటికే అనేకసార్లు పరిశీలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు బృందాలు మధ్యప్రదేశ్‌, ఒడిశా, హైదరాబాద్‌లో పర్యటించి కొన్ని ఆధారాలు సేకరించాయి. నిందితుడి ఆర్థిక లావాదేవీల సమాచారం కోసం ఓ బృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. నిందితుడు పథకం ప్రకారమే జగన్‌పై దాడికి పాల్పడ్డాడని పోలీసులు అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడి ఆరోగ్యం, మానసిక స్థితి కూడా బాగానే ఉందని కేజీహెచ్‌ వైద్యులు నిర్థారించారు.

36 total views, 1 views today