టీ20ల కోసం విండీస్ హిట్టర్లు వచ్చేశారు..!

భారత్‌పై టెస్టు, వన్డే సిరీస్‌ల్లో విఫలమైన వెస్టిండీస్ జట్టు.. తమకి అచ్చొచ్చిన టీ20ల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. భారత్, వెస్టిండీస్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆ జట్టు హిట్టర్లు ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు.

టెస్టు, వన్డే జట్టులో లేని కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, దినేశ్ రామ్‌దిన్, పొలార్డ్ తదితరులు నిన్న ప్రాక్టీస్ సెషన్‌లో ఎక్కువగా హిట్టింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఆఖరి ఓవర్‌లో ఈ వేదికగానే వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన బ్రాత్‌వైట్ నిన్న దాదాపు మూడు గంటలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడట. మరోవైపు ఏడాది తర్వాత మళ్లీ వెస్టిండీస్ టీ20 జట్టులో బ్రావో, పొలార్డ్ ఆడుతున్నారు.
భారత్ చేతిలో ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న వెస్టిండీస్ జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌లోనూ 1-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో.. కనీసం ఈ మూడు టీ20ల సిరీస్‌లోనైనా గెలవాలని కరీబియన్ టీమ్ ఆశిస్తోంది.

82 total views, 1 views today