ఆర్డ‌ర్ చేసింది ఫోను… వ‌చ్చింది స‌బ్బులు

గ్రేటర్ నోయిడా : కార్వా చౌత్ పర్వదినం రోజున తన భార్యకు బహుమతిగా స్మార్ట్ ఫోన్‌ను ఇవ్వాలనుకున్న భర్తకు నిరాశ ఎదురైంది. ఆ పండుగ రోజున ఆనందంగా ఉండాలనుకున్న ఆ దంపతులు.. తీవ్ర అసహనంతో పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ వ్యాపారి అమెజాన్‌లో అక్టోబర్ 26న స్మార్ట్ ఫోన్ బుక్ చేశాడు. ఆ సమయంలోనే క్రెడిట్ కార్డు ద్వారా రూ. 16 వేలు చెల్లించాడు. మరుసటి రోజు(అక్టోబర్ 27)న సాయంత్రం స్మార్ట్ ఫోన్ ఇంటికి వచ్చేసింది. అయితే ఆ పార్శిల్‌ను వ్యాపారి, ఆయన భార్య.. డెలివరీ బాయ్ ముందే విప్పారు. అందులో ఫోన్‌కు బదులుగా రెండు సబ్బు బిళ్లలు ఉండటంతో షాక్‌కు గురయ్యారు.

దీంతో డెలివరీ బాయ్ అనిల్ కుమార్‌ను తీసుకొని వ్యాపారి విశాల్ త్యాగి, ఆయన భార్య మేఘా కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఫోన్‌కు బదులుగా సబ్బు బిళ్లలు రావడంపై డెలివరీ బాయ్‌ను విశాల్ త్యాగి ప్రశ్నించగా.. తనకేమీ తెలియదన్నారు. కేవలం తాను డెలివరీ మాత్రమే చేశానని తెలిపాడు. మొత్తానికి డెలివరీ బాయ్, అమెజాన్ రీజినల్ డైరెక్టర్ అమిత్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

64 total views, 1 views today