ఐక్య‌త‌కు చిహ్నం… స్టాట్యూ ఆఫ్ యూనిటీ

ప్రపంచంలో అతి పెద్ద విగ్ర‌హం అని ఎవ‌రైనా అడిగితే… చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధా అని ఠ‌క్కున చెప్పేస్తాం. ఎందుకంటే దీని ఎత్తు 153 మీట‌ర్లు. కానీ, ఇది నిన్న‌టి వ‌ర‌కే. ఈ రోజు నుంచి ప్ర‌పంచంలో అతి ఎత్తైన విగ్రహం ఎక్క‌డ ఉంది అని అడిగితే వ‌చ్చే స‌మాధానం మాత్రం భార‌త్ అని. ఔను. అదే స్టాట్యూ ఆఫ్ యూనిటీ. అదేనండీ.. ఉక్కు మనిషి సర్దార్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం. న‌ర్మ‌దా తీరంలో ఏర్పాటు చేసిన ఈ విగ్ర‌హం ఎత్తు 182 మీట‌ర్లు. ఇంత‌కీ ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా. ఎందుకంటే… ఈ రోజు స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ 143వ జ‌యంతి.
ఈ సంద‌ర్భంగా గుజ‌రాత్‌లోని న‌ర్మ‌దా న‌దీ తీరంలో ఏర్పాటు చేసిన ఈ ప‌టేల్ విగ్ర‌హాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించ‌నున్నారు. భారత స్వ‌తంత్ర సంగ్రామ యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్ రాష్ట్రంలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 182 మీటర్లు అన్న‌మాట.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ… ఈ పేరే ఎందుకు?

దేశ విభ‌జ‌న స‌మ‌యంలో ఏర్ప‌డిన పెను సంక్షోభాన్ని ప‌టేల్ ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా వ్య‌వ‌హ‌రించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు. 554 రాజ సంస్థానాల‌ను భార‌త్‌లో విలీనం చేయ‌డంలో ప‌టేల్ కీల‌క పాత్ర పోషించి న‌వ నిర్మాణ రూప‌క‌ర్త‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ కార్య‌నిర్వ‌హ‌ణ‌కు ప‌టేల్ ప్రద‌ర్శించిన ఉక్కు సంక‌ల్పం, ప‌ట్టుద‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌వ‌స‌రం లేదు. భార‌త్‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన స‌మ‌యంలో ఎంతో మంది సంబ‌రాల్లో మునిగిపోయి ఉంటే… కొంద‌రు సంస్థానాధీశులు స్వ‌తంత్ర పాల‌కులుగా కొనసాగాల‌ని అనుకున్నారు. మ‌రికొంద‌రైతే శ‌త్రుదేశ‌మైన పాకిస్థాన్‌తో క‌ల‌వాల‌నుకున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌న్నింటినీ ప‌టేల్ ధైర్యంగా, చ‌తుర‌త‌తో ఎదుర్కొని దేశాన్ని ఏకం చేశారు. క‌ల్లోల ప‌రిస్థితి నుంచి దేశ స‌మైక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌ల‌ను కాపాడిన ఘ‌న‌త ఆయ‌న‌ది. స్వాతంత్య్రం ముందు, త‌ర్వాత అనిత‌ర‌మైన సేవ‌లు అందించారు. ఈ కార‌ణంగానే న‌ర్మ‌దా తీరంలో ఏర్పాటు చేసిన ఆయ‌న విగ్ర‌హానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. ఇంత‌టి గొప్ప నాయ‌కుడికి దేశ చ‌రిత్ర‌లో స‌రైన స్థానం ద‌క్క‌లేద‌ని గుర్తించిన ఎన్డీఏ ప్ర‌భుత్వం స‌ర్దార్ జ‌న్మ‌దినాన్ని రాష్ట్రీయ ఐక్యత దినోత్స‌వంగా నిర్వ‌హిస్తోంది.

182 మీట‌ర్లే ఎందుకు?

ప‌టేల్ విగ్ర‌హాన్ని 182 మీట‌ర్ల ఎత్తు ఏర్పాటు చేయ‌డం వెనుక ఓ కార‌ణం ఉంది. అది ఏంటంటే… గుజ‌రాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేట్లుగా నిర్మిస్తున్నారు. 2015 డిసెంబరు 19న దీనికి సంబంధించిన నిర్మాణ పనులు మొదలయ్యాయి. మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) ఈ నిర్మాణ ప‌నులను చూసుకుంటుంది. గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్ నుంచి 200 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఈ విగ్రహం ఉంది. విగ్రహం వద్ద పటేల్ జీవితానికి సంబంధించిన విశేషాల‌తో మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. కేవలం 33 నెలల్లోనే విగ్ర‌హ నిర్మాణం పూర్తి అయినందుకు ఎల్ అండ్ టీ యాజ‌మాన్యం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఈ విగ్రహ స్థాపన ప్రాజెక్టుకు రూ.2,989 కోట్లు ఖర్చుపెట్టారు. కంచు తాపడం వ్యయం దీనికి అదనం. 1,80,000 ఘనపు మీటర్ల కాంక్రీటు, 18,500 టన్నుల ఉక్కు, 1700 టన్నుల కంచుతోపాటు మరో 6,500 టన్నుల ఉక్కు ఆకృతులు, 1700 టన్నుల కంచు తాపడాన్ని దీని తయారీలో ఉపయోగించారు.

రైతుల నుంచి ఇనుము సేక‌ర‌ణ‌

వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ గుజ‌రాత్‌లోని బార్డోలీలో రైతు ఉద్య‌మాన్ని స‌మ‌ర్థంగా నాయ‌క‌త్వం వ‌హించి స‌ర్దార్ అని బిరుదు పొందారు. దేశ‌వ్యాప్తంగా ఆరు ల‌క్ష‌ల గ్రామాల్లో రైతుల నుంచి ఇనుము సేక‌రించి ఆ ఇనుముతో ప‌టేల్ విగ్ర‌హ నిర్మాణం చేయాల‌నుకున్నారు. ఇందుకోసం మూడు నెల‌ల పాటు ప్ర‌త్యేక క్యాంపైన్ నిర్వ‌హించి సుమారు 5వేల ట‌న్నుల ఇనుమును సేక‌రించారు. కానీ, విగ్ర‌హ నిర్మాణంలో దీన్ని వాడ‌లేదు. ఇందుకు కార‌ణం… భ‌విష్య‌త్తులో ఈ ఇనుమును వాడితే స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు తెలిపారు. దీంతో సేక‌రించిన ఆ ఇనుమును విగ్ర‌హ నిర్మాణంలో వాడ‌లేదు కానీ చుట్టు ప‌క్క‌ల ప‌నుల‌కు ఉప‌యోగించిన‌ట్లు తెలిపారు. దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో ఈ విగ్ర‌హ నిర్మాణ ప్రాజెక్టుకు ఖ‌ర్చు చేస్తున్నారు.

స్థానికుల నుంచి వ్య‌తిరేక‌త‌

ప‌టేల్ విగ్ర‌హ నిర్మాణం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఆ చుట్టు ప‌క్క‌ల గ్రామాల రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. సాగునీరు అంద‌క ఎంతో ఇబ్బంది ప‌డుతుంటే… వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించి విగ్ర‌హాలు క‌డ‌తారా అని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఆ త‌ర్వాత మ‌రికొంద‌రు విగ్ర‌హ నిర్మాణానికి ఎలాంటి అనుమ‌తులు లేవంటూ కేంద్రానికి లేఖ‌లు రాశారు. విగ్ర‌హ ఏర్పాటు వ‌ల‌న ప‌ర్యాట‌కం అభివృద్ధి చెంది చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా మేలు జ‌రుగుతోంద‌ని అధికారులు తెలిపారు.

స‌ర్దార్ ప‌టేల్ 1875 అక్టోబ‌రు 31న గుజ‌రాత్‌లోని న‌దియాద్‌లో ల‌డ్బా-జావేర్‌భాయ్ దంప‌తుల‌కు జ‌న్మించారు. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన త‌ర్వాత తొలి ఉప ప్ర‌ధానిగా సేవ‌లందించారు. 1950 డిసెంబ‌రు 15న గుండె పోటుతో ప‌టేల్ తుది శ్వాస విడిచారు. ఆయ‌న భార్య పేరు జావెర్భ ప‌టేల్‌. ఈయ‌న‌కు కుమార్తె మ‌ణిబెన్ ప‌టేల్‌, కుమారుడు ద‌హ్య‌భాయ్ ప‌టేల్ ఉన్నారు. 1991లో ప‌టేల్‌కు భార‌త అత్యున్న‌త పుర‌స్కారాల్లో ఒక‌టైన భార‌త ర‌త్న‌ను ప్ర‌క‌టించింది.

49 total views, 1 views today