అమెరికాలో లోయలో ప‌డి భార‌తీయ జంట దుర్మ‌ర‌ణం

న్యూయార్క్‌: భారత్‌కు చెందిన ఓ జంట అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిఫోర్నియాలోని ప్రముఖ యోసెమైట్‌ జాతీయ పార్కులో సుమారు 800 అడుగుల అత్యంత ఎత్తైన పర్వతం పైనుంచి వీరు లోయలో పడ్డట్లు స్థానిక వార్తా పత్రిక వెల్లడించింది. వీరిని విష్ణు విశ్వనాథ్‌ (29), మీనాక్షీ మూర్తి (30)గా గుర్తించారు. విశ్వనాథ్‌కు ఇటీవలే సిస్కో సంస్థలో సిస్టమ్‌ ఇంజినీరుగా ఉద్యోగం రావడంతో భార్యాభర్తలిద్దరూ ఇటీవలే న్యూయార్క్‌ నుంచి శాన్‌జోస్‌ నగరానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప‌ర్వతంపై భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా దిగిన ఫోటోను విశ్వనాథ్‌ ఫేస్‌బుక్‌లో ఉంచారు.

ఘటన జరిగిన ఒక రోజు తర్వాత వీరి మృతదేహాలను పర్యటకులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. దంపతుల మృతికి గల కారణాలేంటో తెలియాల్సి ఉందని, ఆ దిశగా విచారణ జరుపుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తూ కాలుజారి లోయలో పడ్డారా..? లేదా ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా వీరి మృతిపట్ల కేరళకు చెందిన చెంగునూర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేసింది. తమ పూర్వ విద్యార్థులైన విష్ణు, మీనాక్షి మరణించడం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. వీరిద్దరు 2006-10 బ్యాచ్‌కు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన విద్యార్థులు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియాలో విచారం వ్యక్తం చేసింది.

135 total views, 1 views today