విశాఖ డీసీపీకి నిమ్మకాయలతో స్వాగతం

విశాఖ: సాధార‌ణంగా ఉన్నతాధికారులు పదవీ బాధ్యతలు చేపట్టేటప్పుడు పుష్పగుచ్ఛాలతో కొంద‌రు, ఫ‌లాల‌తో మ‌రికొంద‌రు స్వాగతం పలకడం మ‌నం చూస్తుంటాం. అయితే విశాఖ పోలీసులు మాత్రం తమ ఉన్నతాధికారికి వినూత్నంగా స్వాగతం పలికారు. పుష్పాలు, ఫ‌లాలకుబ‌దులు నిమ్మ‌కాయ‌లు ఇచ్చారు. దీనికి కారణం లేక‌పోలేదండోయ్‌….
విశాఖ శాంతి భద్రతల డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన రవీంద్రబాబుకు సిబ్బంది వినూత్న స్వాగతం లభించింది. గతంలో కృష్ణా జిల్లా నిఘా విభాగం ఎస్పీగా విధులు నిర్వహించి.. విశాఖకు బదిలీపై వచ్చిన ఆయనకు సిబ్బంది నిమ్మకాయలతో స్వాగతం పలికారు. ఇతర విభాగాల్లో పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికే సంప్రదాయం ఉండగా… పోలీసు శాఖలో మాత్రం నిమ్మకాయలతో స్వాగతం పలకడం సంప్రదాయంగా వస్తోంది. మిగిలిన ఉద్యోగాల పోలీసు శాఖలో విధులు భిన్నమైనవి. ఒత్తిడి, శారీరక శ్రమతో కూడిన బాధ్యతలు నిర్వర్తించే సమయంలో అధికారి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో నిమ్మకాయలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఒక్కో సిబ్బంది డీసీపీకి రెండు నిమ్మకాయల చొప్పున ఇచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

30 total views, 1 views today