ఇక నుంచి పోస్టు ద్వారా పద్మావతి అమ్మవారి ఆశీర్వాచనం

పోస్టు ద్వారా శ్రీవారికి కానుకలు పంపే భక్తులకు తిరిగి వాటికి సంబంధించిన రసీదు, పూజాక్షితలు, స్వామి చిత్రపటాన్ని ఆ శాఖ పంపుతోంది. పదేళ్ల కిందట 2008లో ఆశీర్వచనం పేరుతో తపాలా శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారికి తపాలాశాఖ ద్వారా కానుకలు పంపే భక్తులకు ఇకపై రశీదుతో పాటు అమ్మవారి కుంకుమ, పవిత్ర పసుపుదారం, చిత్రపటం, అక్షితలు ఆశీర్వచనంగా అందనున్నాయి. తిరుమల శ్రీవారికి కానుకలు పంపిన మాదిరిగానే పద్మావతి అమ్మవారికి కూడా పంపవచ్చని తపాలా శాఖ పేర్కొంది. శ్రీవారికి భక్తులు అందజేసే కానుకలు అందిన తర్వాత, రశీదుతో పాటు స్వామివారి అక్షితలు, చిత్రపటం తిరిగి రావడంతో తమ కానుకలు స్వామికి చేరాయన్న నమ్మకం కలుగుతుంది. అంతేకాదు కల్యాణ అక్షితలను స్వీకరించామన్న అనుభూతి చెందుతున్నారు. ‘ఈవో, టీటీడీ, తిరుపతి, 517 503’చిరునామాకు కానుకలు పంపాల్సిందిగా అధికారులు సూచించారు.

కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేసే కార్యక్రమానికి ఈ ఏడాది మార్చిలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే కొత్త దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా టీటీడీకి పంపితే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తారు.

53 total views, 1 views today