ఈ నెక్ల‌స్ ధ‌ర కోటి 76 లక్షలు

లండన్: సిక్కు సామ్రాజ్య చక్రవర్తి మహారాజా రంజిత్ సింగ్ భార్య జిందన్ కౌర్ ధరించిన ముత్యాల నెక్లస్ వేలంలో రికార్డు ధర పలికింది. లండన్‌లో జరిగిన ఈ వేలంలో ఈ నెక్లస్ ఏకంగా 1,87,000 పౌండ్ల (సుమారు రూ.కోటి 76 లక్షలు)కు అమ్ముపోవడం విశేషం. ఈ నెక్లస్ కోసం బిడ్డింగ్‌లో తీవ్ర పోటీ నెలకొన్నదని వేలం వేసిన సంస్థ వెల్లడించింది. మహారాజా భార్యల్లో ఆయన మరణం తర్వాత సతికి పాల్పడని ఏకైక రాణి జిందన్ కౌర్. ఆమె ధరించిన నెక్లస్ కావడంతో సహజంగానే ఇది ఊహించిన దాని కంటే ఎక్కువ డిమాండ్ పలికింది. 80 వేల నుంచి లక్షా 20 వేల పౌండ్ల వరకు పలుకుతుందని భావించినా ఇది కొత్త రికార్డు నెలకొల్పింది.

లాహోర్ ట్రెజరీలోని ఎన్నో వస్తువులను వేలం వేయగా.. అందులో ఈ నెక్లస్ కూడా ఒకటి. బోన్‌హామ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్‌లో భాగంగా ఈ వేలం నిర్వహించారు. రాజుల కాలం నాటి ఎన్నో వస్తువులను వేలం వేయగా.. అన్నీ కలిపి మొత్తం 18,18,500 పౌండ్లు పలకడం విశేషం. అందులోనూ జిందన్ కౌర్ నెక్లస్‌కే ఎక్కువ ధర పలికినట్లు వేలం సంస్థ వెల్లడించింది. మహారాణి జిందన్ కౌర్ బ్రిటిష్ చొరబాటును ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఆమెను బంధించి, జైల్లో వేయగా.. తప్పించుకొని మొదట నేపాల్‌కు, ఆ తర్వాత లండన్‌కు ఆమె వెళ్లిపోయారు. అక్కడే తన ఐదేళ్ల కొడుకు దులీప్ సింగ్, తన నగలను ఆమె తిరిగి దక్కించుకోగలిగింది. ఆ నగల్లోని నెక్లస్‌నే ఇప్పుడు వేలం వేశారు.

43 total views, 1 views today