‘24కిస్సెస్‌’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: అయోధ్య కుమార్‌ కృష్ణంశెట్టి దర్శకత్వంలో అరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘24కిస్సెస్‌’. నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం అనేది ఉపశీర్షిక. హెబ్బాపటేల్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర థియేటిక్రల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

రావు రమేష్‌తో కలిసి అదిత్‌ అరుణ్‌ ‘ప్రేమదేశం’లోని పాట పాడుతున్న సన్నివేశంతో ట్రైలర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత హెబ్బా పటేల్‌తో వచ్చిన సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ‘ప్రేమిస్తున్నావా? లేదా?’ అని అదిత్‌ను హెబ్బా పటేల్‌ అడిగితే, ‘అన్ని బంధాలకు ఏదో ఒక పేరు పెట్టాల్సిందేనా’ అంటూ అదిత్‌ ఎదురు ప్రశ్నిస్తూ కనిపించారు. మరి వీరి ప్రేమ చివరకు ఏమైంది. ఈ సినిమాకు ‘24కిస్సెస్‌’ అని పేరు పెట్టడం వెనుక ఉన్న కథేంటో తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.

రెస్పెక్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై సంజయ్‌రెడ్డి, అనిల్‌ పల్లాల, అయోధ్యకుమార్‌ కృష్ణమూర్తి ఈ సినిమా నిర్మిస్తున్నారు. జోయ్‌ బారువా స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

39 total views, 1 views today