శబరిమల పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది

10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లపై ఎప్పుడు విచారిస్తామనే అంశాన్ని రేపు నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, ఎస్కే కౌర్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం శబరిమలలోని అయ్యప్ప ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని, ఈ అంశంపై సత్వరమే విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై 19 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపిన జస్టిస్‌ గొగోయ్‌.. ఈ వ్యాజ్యాలపై ఎప్పుడు విచారణ జరపాలనే అంశాన్ని మంగళవారం నిర్ణయిస్తామని తెలిపారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువడినప్పటి నుంచి శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించగా భక్తులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని అరెస్టులు, లాఠీఛార్జిలకు దారితీయడంతో శబరిమల పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపించిన విషయం తెలిసిందే.

64 total views, 1 views today