నేనూ, తారక్‌ చేసే సినిమాలు మిగిలిన వాళ్లు చేయడం అసాధ్యం-బాలకృష్ణ

‘‘సినిమా అంటే వినోదమే కాదు, ఆలోచననీ రేకెత్తించాలి. అలాంటి మంచి సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. త్రివిక్రమ్‌ దర్శకుడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘తెలుగు దేశం పార్టీకి తొలి శ్రామికుడు మా అన్నయ్య నందమూరి హరికృష్ణ. ఆయన మనసు వెన్న.. మనిషి మొరటు. అది ఆయన లక్షణం. అదే గొప్ప అలంకారం. నాన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. చైతన్య రథానికి సారథిగా పనిచేశారు. రవాణాశాఖ మంత్రిగా చాలా సేవలు చేశారు. ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో బిజీగా ఉండడం వల్ల ‘అరవింద సమేత’ చూడలేకపోయా. ‘పాలిచ్చి పెంచిన తల్లికి పరిపాలించడం ఓ లెక్కా’ అనే డైలాగ్‌ వింటే.. ‘లెజెండ్‌’లో స్త్రీ గొప్పదనం గురించి చెప్పిన డైలాగ్‌ గుర్తొచ్చింది. మంచి ఇతివృత్తం తీసుకున్నారు త్రివిక్రమ్‌. పదునైన సంభాషణలు రాశారు. చిత్రసీమ గర్వించదగిన దర్శకుడు. నేనూ, తారక్‌ చేసే సినిమాలు మిగిలిన వాళ్లు చేయడం అసాధ్యం. ఎందుకంటే మేం ఎక్కువగా లార్జర్‌ దన్‌ లైఫ్‌ పాత్రలు చేస్తుంటాం. మా సినిమాల్లో నవరసాలూ ఉండాలని కోరుకుంటారు అభిమానులు. మా పాత్రలూ అలానే ఉంటాయి. అందరూ కష్టపడితేనే మంచి సినిమా వస్తుంది. అలా ఈ సినిమాకి అంతా కష్టపడ్డార’’న్నారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘ఓ మంచి ప్రయత్నానికి నాంది పలికారు త్రివిక్రమ్‌. ఈ విజయదశమికి నల్లమబ్బు కమ్మిన విషాద ఛాయల్లో ఉన్న మా కుటుంబానికి ఓ కొత్త వెలుగు తీసుకొచ్చారు. జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం అందించారు. నాన్నగారు లేకపోయినా… మా తండ్రి హోదాలో మా బాబాయ్‌ ఇక్కడికి వచ్చార’’న్నారు. కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘రాయలసీమ యాసలో తమ్ముడు సంభాషణలు చెబుతుంటే అక్కడే పుట్టి పెరిగాడేమో అనిపించింది. త్రివిక్రమ్‌ వినోదాత్మక చిత్రాలు తీశారు. తొలిసారి పూర్తిస్థాయి ఎమోషనల్‌ చిత్రం తెరకెక్కించారు. పతాక సన్నివేశాలు చాలా బాగున్నాయి.

జగపతిబాబు పాత్రలో ఆయన్ని కాకుండా మరొకరిని ఊహించలేం. ఆ పాత్ర అంత బాగుండడంతోనే తారక్‌ పాత్ర మరింత బాగా వచ్చింది. ఇళయరాజా స్థాయిలో తమన్‌ రీ రికార్డింగ్‌ అందించాడ’’న్నారు. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘‘ఈ విజయం అనూహ్యమైందేం కాదు. ముందే ఊహించా. అది నా గొప్ప కాదు. నాకు ప్రేక్షకుల అభిరుచి తెలుసు. దానికి తగ్గట్టు త్రివిక్రమ్‌ తన శక్తినంతటినీ ధారబోసి ఓ కథ సృష్టించాడు. మనిషిని మేల్కొల్పాలంటే చేయాల్సింది యుద్ధం కాదు.. శాంతి. ఈ విషయాన్ని త్రివిక్రమ్‌ చక్కగా చెప్పాడ’’న్నారు. కథానాయిక పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘అరవింద లాంటి మంచి పాత్ర నాకిచ్చారు త్రివిక్రమ్‌. మహిళలకు అలాంటి శక్తిమంతమైన పాత్ర ఇవ్వడం అరుదు. ఈ చిత్రంలో స్త్రీ పాత్రలన్నీ ఉన్నతంగా ఉంటాయ’’ని చెప్పింది. జగపతిబాబు మాట్లాడుతూ ‘‘త్రివిక్రమ్‌తో ఎప్పటి నుంచో పని చేయాలని కోరిక. ఇంతకంటే క్రూరంగా నన్నెవ్వరూ చూపించలేరు. బసిరెడ్డి అనే పాత్ర గురించి మారుమూల ప్రాంతాల్లోనూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం త్రివిక్రమ్‌. 2010లోనే హీరోగా నా కెరీర్‌ అయిపోయింది. 2012లో బాలయ్యతో చేసిన ‘లెజెండ్‌’తో మళ్లీ నాకు కొత్త ఊపిరి వచ్చింది. ‘జగపతిబాబు పాత్ర బాగుండాలి’ అని బాలయ్య అంటుండేవారు. అదే మాట ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా చెప్పాడ’’న్నారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ దసరాకి గొప్ప కానుక ఇచ్చారు. మాటలు రానంత ఆనందాన్ని పంచారు. నటీ నటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతల’’న్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణ, రామజోగయ్య శాస్త్రి బ్రహ్మాజీ, నరేష్‌, తమన్‌, రామ్‌లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

131 total views, 1 views today