50ఏళ్ల తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటా

‘50ఏళ్ల తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను’ అంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ప్లకార్డు పట్టుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. 10-50 ఏళ్ల లోపు వయసు మహిళలను కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు మహిళా భక్తులు, సామాజిక కార్యకర్తలు ఆలయంలోకి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పోలీసుల సహాయంతో కొంత దూరం వెళ్లినప్పటికీ ఆందోళనల కారణంగా వెనుదిరగక తప్పలేదు. దీంతో శబరిమల, సన్నిధానం, పంబ, నీలక్కల్‌ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలోనే అయ్యప్పమాల వేసుకొని తల మీద ఇరుముడి పెట్టుకున్న తొమ్మిదేళ్ల చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నాకు 50 ఏళ్లు పూర్తయిన తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను. అప్పటి వరకు రాను’ అని అర్థం వచ్చేలా రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని ఆలయంలోకి ప్రవేశించింది. సుప్రీం తీర్పు ప్రకారం మహిళా భక్తుల ప్రవేశాన్ని ఎక్కువగా అడ్డుకున్న వారిలో మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాలుగో రోజు కూడా శబరిమల పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీలక్కల్‌ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

59 total views, 1 views today