శరణు ఘోష..నిరసనలు….లాఠీలు….శబరిమల

శబరిమల కొండల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తొలిసారిగా అయిదు రోజుల పూజల నిమిత్తం ఆలయాన్ని తెరవగా, పూజల్లో పాల్గొనడానికి కొందరు మహిళలు సిద్ధమయ్యారు. అయితే నీలక్కల్‌ వద్ద పెద్దసంఖ్యలో గుమిగూడిన భక్తులు బస్సులతో పాటు ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయడం ప్రారంభించి, అర్హత లేని మహిళలు వెళ్లకూడదంటూ కొందరిని దింపివేశారు. రాళ్లు విసిరి కొన్ని వాహనాలను ధ్వసం చేశారు. అలా చేయవద్దని పోలీసులు పదేపదే చెప్పినా వినకపోవడంతో లాఠీ ఛార్జీ చేశారు. ఆందోళనకారులు కూడా తొలుత వారిని ప్రతిఘటించారు. పోలీసుల దాడిలో ఓ వృద్ధ మహిళ, మరికొందరు గాయపడ్డారు. రక్తమోడుతున్న ఆ మహిళను ఆసుపత్రికి తరిలించారు. తరువాత ఆందోళనకారులు చెల్లాచెదురుగా పరుగెత్తి సమీపంలోని అడవిలో తలదాచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాధవి (40), తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడానికి ప్రయత్నించగా పంబ వద్ద భక్తులు వారిని నిలువరించారు. పోలీసుల సహాయంతో కొంతదూరం వెళ్లినా, భక్తులు అడ్డగించడంతో వెనక్కి తిరిగి వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత శబరిగిరి వైపు వెళ్లిన తొలి మహిళ ఆమే కావడం గమనార్హం.

నిరసన

వేకువ జాము 4.15 గంటల ప్రాంతంలో ప్రధాన అర్చకుడి (తంత్రి) మనుమడు రాహుల్‌ ఈశ్వర్‌, తన నాన్నమ్మ (90 ఏళ్లు) వందలాది మంది భక్తులతో కలిసి వాహనంలో పంబకు వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు రాహుల్‌ను అరెస్టు చేశారు. శబరిమల ఆలయ సంరక్షులుగా ఉన్న పందళం రాజ కుటుంబీకులు, ప్రధాన అర్చకుల కుటుంబ సభ్యులు ‘నామజపం’ చేస్తూ పంబలో నిరసన తెలిపారు.

ఆందోళనకారులు టీవీ వాహనాల పైనా దాడి చేసి ధ్వంసం చేశారు. వార్తల సేకరణకు వచ్చిన మహిళా పాత్రికేయులను అవహేళన చేశారు. కనీసం నాలుగు జాతీయ ఛానెళ్లకు చెందిన మహిళా పాత్రికేయులను అడ్డుకొని, వారిని వాహనాల నుంచి దింపివేశారు. ఈ క్రమంలో దాదాపు పదిమంది గాయపడ్డారు.

స్త్రీలపై నిషేధం సాంప్రదాయం

అయ్యప్ప సన్నిధానంతో శబరిగిరి చుట్టుపక్కల నివసించే గిరిజన, దళితులకు ప్రత్యక్ష సంబంధం ఉంది. అయ్యప్ప తమ దేవుడని, ఆలయ ప్రవేశం విషయమై ఉన్న నియమాలు తమ సంప్రదాయాలని గిరిజనులు బలంగా విశ్వసిస్తారు. అత్తతోడు ప్రాంతానికి చెందిన గిరిజనుల నాయకుడు వి.కె.నారాయణ్‌ (70) మాట్లాడుతూ శబరిమలలోని ఆచారవ్యవహారాలను వివరించారు. ‘‘20 శతాబ్దం ప్రారంభం నుంచే శబరిమలకు జనం రావడం ప్రారంభమయింది. అంతకుముందు మండల-మకరవిలక్కు పూజలునిర్వహించడానికి కేవలం రాజకుటుంబీకులు, అర్చకులు మాత్రమే వచ్చేవారు. మా పూర్వీకులే దేవాలయంలో దీపాలు వెలిగించేవారు. కొన్ని వయసుల్లోని మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించడం మా సంప్రదాయంలో భాగం.’’ అని చెప్పారు. ఎస్సీ జాబితాలోకివచ్చే కురవ సామాజిక వర్గానికి చెందిన కార్త్యాయని (54) మాట్లాడుతూ సంప్రదాయాలను కాపాడవలసిందేనని అన్నారు. ‘మేము ఆలయానికి కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తున్నాం. ఆలయానికివెళ్లే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు.’అని తెలిపారు.

80 total views, 1 views today