నిలకడగా దిలీప్‌ కుమార్ ఆరోగ్య పరిస్థితి

ముంబయి: లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అలనాటి బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి యాజ‌మాన్యం ప్రకటించింది. న్యూమోనియోతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి ఉపాధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ… ‘ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు’ అని చెప్పారు.

నిన్న ఆస్పత్రి వద్ద దిలీప్‌ కుమార్‌ భార్య సైరా భానుని ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పలేదు. దిలీప్‌ కుమార్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన మేనల్లుడు ఫైజల్‌‌ ఫరూఖి ట్విటర్‌ ద్వారా వివరాలు తెలుపుతున్నారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ… ‘సైరాగారికి, లీలావతి ఆస్పత్రికి విపరీతంగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. దయచేసి దిలీప్‌ కుమార్‌ ఆరోగ్య పరిస్థితిపై అడగకండి. వారిని వారి పనులు చేయనివ్వండి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని వివరాలనూ నేను దిలీప్‌ కుమార్ ట్విటర్‌ ఖాతాలోనే పోస్ట్‌ చేస్తాను. మీ ప్రార్థనలు, అర్థం చేసుకుంటున్న తీరుకి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

కాగా, దిలీప్‌ కుమార్‌ మరోసారి ఆస్పత్రిలో చేరారని ఫైజల్‌‌ ఫరూఖి ఈ విషయాన్ని నిన్న సాయంత్రం వెల్లడించిన విషయం తెలిసిందే. ‘దిలీప్‌ కుమార్‌ నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారని మీకు తెలియజేస్తున్నా. ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. ట్విటర్‌ ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాను’ అని ఆయన నిన్న దిలీప్‌ కుమార్‌‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

51 total views, 1 views today