నోటా రివ్యూ

సినిమా పేరు: నోటా
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహరీన్‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్,న‌ట‌రాజ‌న్‌, య‌షికా ఆనంద్‌, అన‌స్తాసియా, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు…
ద‌ర్శ‌కత్వం: ఆనంద్ శంక‌ర్.
విడుద‌ల‌: 05-10-2018.

రేటింగ్ : 2.5/5

కధ :

ముఖ్య‌మంత్రి వాసుదేవ్ (నాజ‌ర్‌) కొడుకు వ‌రుణ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌). ఆడుతూ పాడుతూ స‌ర‌దాగా గ‌డిపే ఓ యువ‌కుడు. గ్ర‌హాలు అనుకూలంగా లేవ‌ని ఒక స్వామీజీ చెప్ప‌డంతో పాటు.. త‌న‌పై ఉన్న ఓ కేసు కోర్టులో ఉండ‌టంతో రాత్రికి రాత్రే ప‌ద‌వి నుంచి దిగిపోయి, త‌న కొడుకు వ‌రుణ్‌ని ముఖ్య‌మంత్రిని చేస్తాడు వాసుదేవ్‌. అస‌లు రాజ‌కీయం అంటే ఏంటో తెలియ‌ని వ‌రుణ్‌కి అప్ప‌ట్నుంచి వ‌రుస‌గా స‌వాళ్లు ఎదుర‌వుతాయి. కొన్ని రోజులే ప‌ద‌విలో కొన‌సాగుతాడ‌నుకున్న వ‌రుణ్ పూర్తిస్థాయిలో బాధ్య‌త‌లు చేప‌ట్టాల్సి వ‌స్తుంది. మ‌రి త‌న‌కు ఎదురైన స‌వాళ్లని ఎలా గట్టెక్కాడు? అస‌లు స్వామీజీకి, వాసుదేవ్‌కి మ‌ధ్య సంబంధమేమిటి? వాసుదేవ్ ఆడిన రాజ‌కీయ క్రీడ‌లో ఒక పావు మాత్ర‌మే అనుకున్న వ‌రుణ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాక ఏం చేశాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉంది :

రాజ‌కీయ నేప‌థ్యంతో కూడిన క‌థ అన‌గానే ఎత్తులు, పై ఎత్తులు వాటి చుట్టూ చోటు చేసుకునే నాట‌కీయ ప‌రిణామాలతో అత్యంత ఆస‌క్తిక‌రంగా సాగుతుంటుంది. తెర‌పై ఏం చూపించినా స‌రే అది ప్రేక్ష‌కులకు క‌నెక్ట్ అయ్యే ల‌క్ష‌ణం ఈ జోనర్‌ సినిమాలకు ఉంటుంది. స‌హ‌జంగానే ప్ర‌జ‌లు రాజ‌కీయాల గురించి మాట్లాడుకుంటుంటారు కాబ‌ట్టి… చుట్టూ జ‌రిగే ప‌రిణామాలే తెర‌పై ప్ర‌తిబింబిస్తుంటాయి. ఈ క‌థ కూడా అలాంటిదే. అయితే ఇందులో నాట‌కీయ‌త లోపించింది. వ‌ర్త‌మాన రాజ‌కీయాల్ని ప్ర‌తిబింబించేలా క‌థ‌, క‌థ‌నాలు సాగిన‌ప్ప‌టికీ… క‌థ‌లోనూ మంచి అంశాల్నే స్పృశించిన‌ప్ప‌టికీ అవి సినిమా మాధ్య‌మానికి… విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిజం స్థాయికి త‌గ్గ‌ట్టుగా లేక‌పోవ‌డంతో స‌న్నివేశాలు ఆశించిన స్థాయిలో పండ‌లేదు. తొలి స‌గ‌భాగం వర‌కు ఫ‌ర్వాలేద‌నిపించినా.. ద్వితీయార్ధంలో స‌న్నివేశాలు మ‌రీ చ‌ప్ప‌గా సాగుతాయి. ప్ర‌థ‌మార్ధంలో విజయ్‌ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక స‌వాళ్లు ఎదుర‌వడం ఎప్పుడైతే ఆరంభ‌మ‌వుతాయో అప్ప‌ట్నుంచి క‌థ ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపు తీసుకుంటుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ శైలి, స‌న్నివేశాలు పండ‌టం మొద‌ల‌వుతుంది. అయితే ఆ జోరు చివ‌రివ‌ర‌కు కొన‌సాగుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది. అల్ల‌ర్ల‌ని అదుపు చేయ‌డం కోసం ముఖ్య‌మంత్రి తీసుకునే నిర్ణ‌యాలు… మూడు రోజులు ఎవ్వ‌రూ బ‌య‌టికి రావొద్దంటూ అల్టిమేటం జారీ చేసిన విధానం అస‌లు సిస‌లు రాజకీయ డ్రామాని త‌ల‌పిస్తుంది. కానీ, ఆ త‌ర్వాత నుంచే క‌థ గాడి తప్పినట్లు అనిపిస్తుంది. రౌడీ సీఎం వ‌స్తున్నాడ‌ని చెప్పండి అంటూ విరామం స‌మ‌యంలో విజ‌య్‌ దేవ‌ర‌కొండ చెప్పిన డైలాగ్ ద్వితీయార్ధం వైపు ఆస‌క్తిగా చూసేలా చేసింది. అయితే, వ‌ర‌ద ముప్పు నుంచి త‌ప్పించ‌డం వంటి స‌న్నివేశాల వ‌ర‌కు మాత్ర‌మే ఎఫెక్టివ్‌గా అనిపించినా… ఆ త‌ర్వాత స‌న్నివేశాల‌న్నీ సాదాసీదాగా అనిపించాయి. స‌రైన విలనిజం లేక‌పోవ‌డం ఇందుకు కార‌ణం. స్వామీజీ పాత్ర‌ని ఉప‌యోగించుకోవ‌ల్సిన అవ‌స‌రం ఉన్నా… దాన్ని వాడుకోలేదు. దాంతో ప‌తాక స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే ముగుస్తాయి. రాజ‌కీయ ప్ర‌ధాన‌మైన క‌థ కాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ అంశాల జోలికి వెళ్ల‌లేదు. తెలుగు రాజ‌కీయ నేప‌థ్యం కంటే కూడా త‌మిళ‌నాట ప‌రిస్థితులే ఎక్కువ‌గా తెర‌పై క‌నిపిస్తాయి.

409 total views, 1 views today