ప్రేమికుడికి గాంధీ ఏం చెప్పాడో తెలుసా ?

సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం గాంధీజీకి అలవాటు. స్నానానికి ముందు ఒళ్లు మర్దన చేయించుకునేటప్పుడు కూడా చేత్తో పుస్తకం పట్టుకుని చదువుకునేవారు. ఉదయం భోజనం వేళ ఉత్తరాలు చదివించుకొనేవారు. వాటిలో చాలామటుకు ఆయన సలహానో, ఆశీర్వాదాన్నో అర్థించేవే. ఒకరోజు ఆయన దీవెనలను కోరేవారి సంఖ్య ఎక్కువై నేను కొంచెం విసుక్కోగా, ‘ప్రజలంటే నీకు చీకాకుగా ఉన్నట్లున్నదే’ అని నన్ను ఎద్దేవా చేశారు. ఓ వ్యక్తి తన పెళ్లి విషయంలో సాయం కోరుతూ రాసిన ఉత్తరమొకటి వచ్చింది. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తండ్రి ఒప్పుకోవటం లేదనీ, సాయపడాలంటూ ఓ వ్యక్తి గాంధీజీకి రాశాడు. ఆ ఉత్తరం చూడగానే నాకు నవ్వొచ్చింది. దాన్ని పక్కనపెట్టబోతుండగా గాంధీజీ తనకివ్వమని తీసుకున్నారు. లేఖ చివరిలో ‘మమ్మల్ని కలిపితిరా, సుఖంగా నిలబడగలుగుతాం’ అని ఉండేసరికి గాంధీజీ చటుక్కున అందుకుని ‘విడదీస్తే పడిపోతాం! అన్నాడా!!’ అని నవ్వేశారు. ఆ సాయంత్రం ఆయన స్వదస్తూరీతో ఆ పిల్లవాడికి ఉత్తరం రాశారు. ‘‘మీ తండ్రితో ఏకీభవించనప్పుడు ఆయన పంచన ఉండకుండా వేరేగా బతకండి. అధమపక్షం రెండేళ్లయినా కూలిపని చేసుకుని బతకండి. ఈ పరీక్షకు నీ ప్రేమ నిలబడితే నీకు నా దీవెనలన్నీ లభిస్తాయి’’ అని ముగించారు. ‘అసలా జవాబు రాయటం ఎందుకండీ’ అని అడిగితే…‘‘ఆ యువకుడికి ఏం చెప్పనయ్యా! దేశం కోసం జీవితం అంకితమివ్వమంటే అతగాడికి నచ్చదు. జీవితారణ్యంలో దారి తప్పాడు. అతనికి దారి చూపటానికి కొద్దినిమిషాలు నేను ఖర్చు పెట్టగలగడమే నేను చేయగల సాయం!’’ అని బదులిచ్చారు. ప్రతి ఒక్కరి కోసం ఆయన పడే తాపత్రయమే గాంధీజీని దేశమంతటా వేలాది మందికి ప్రియతమునిగా చేసింది. అందుకే… ఆయన కోరిన వెంటనే ప్రజలు తటాలున లేచి ఎంత గొప్ప త్యాగానికయినా నడుం కట్టుకుని నిల్చునేవాళ్లు!

629 total views, 1 views today