దేవ‌దాస్‌… మూవీ రివ్యూ

సీనియర్‌ హీరో నాగార్జున, నేచురల్ స్టార్‌ నాని కాంబినేషన్‌ లో తెరకెక్కిన మల్టీస్టారర్‌ సినిమా దేవదాస్‌. చాలా కాలం తరువాత వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ స్వయంగా నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. భలే మంచి రోజు, శమంతకమణి లాంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్‌ ఆదిత్య.. నాగ్‌, నాని లాంటి స్టార్లను డైరెక్ట్ చేస్తుండటంతో దేవదాస్‌పై మంచి హైప్‌ క్రియేట్ అయ్యింది. అందుకు తగినట్టుగానే ప్రచార చిత్రాలూ ఆకట్టుకుంటున్నాయి. మరి, నాగ్‌-నానిల కెమిస్ట్రీ ఎలా ఉంది? వారి జోడీ ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య టేకింగ్‌ ఎలా ఉంది?
కథ:
దేవ(నాగార్జున) అంతర్జాతీయ మాఫియా డాన్. తనకు తండ్రిలాంటివాడైన దాదా(శరత్‌కుమార్‌)ను ఓ ముఠా చంపేస్తుంది. వారిని వెతుక్కుంటూ హైదరాబాద్‌ వస్తాడు‌. హైదరాబాద్‌లో దేవను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో దేవపై కాల్పులు జరుపుతారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో దేవ..‌ దాస్‌(నాని) అనే ఓ వైద్యుడి వద్దకు వెళ్తాడు. దేవ‌ను దాస్‌ రక్షిస్తాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దేవ వల్ల దాస్‌ మారాడా? దాస్‌ వల్ల దేవనే మారాల్సి వచ్చిందా? అటు దేవ‌కు ఇటు దాస్‌కు ఉన్న ప్రేమ కథలేంటి? అన్నదే సినిమా.
సినిమా ప్రారంభం చాలా గంభీరంగా ఉంటుంది. దేవ ‌ఎవరు? అతను ఎప్పుడొస్తాడు? అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కలుగుతుంది. దాస్‌ ఎంట్రీతో నవ్వులు మొదలవుతాయి. దేవ, దాస్‌ ఇద్దరూ కలిసినప్పుడు ఆ నవ్వులు పండి మరింత జోరు అందుకుంటుంది. నాగార్జున, నానిల మధ్య సన్నివేశాలే ఈ చిత్రానికి బలం. అవన్నీ ఆద్యంతం హాయిగా నవ్విస్తాయి. కొన్ని గుండెల్ని హత్తుకునేలా ఉంటాయి. దేవ, దాస్‌ల ప్రేమకథలు సరదాగా సాగిపోతాయి. ద్వితీయార్ధం కొంచెం భారంగా సాగుతుంది. అందులో అవయవదానం ఎపిసోడ్‌ను కూడా చిత్రించారు. ఈ సన్నివేశం వెనక ఉన్న ఉద్దేశం బాగున్నా, సరదాగా సాగే సినిమా ఒక్కసారగా సీరియస్‌ టర్న్‌ తీసుకున్నట్లు అనిపిస్తుంది. దేవ‌ మారిపోవడం కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో యథావిధిగా వినోదాన్ని జోడించి ఒక మంచి ముగింపు ఇచ్చారు.
ఎవ‌రెలా చేశారు…
ఈ సినిమాకు నాగ్‌, నాని మూలస్తంభాలు. ఎప్పటిలాగే తమ పాత్రలకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. నాగ్‌ లుక్‌ బాగుంది. గత చిత్రాలకన్నా అందంగా కనిపించారు. నాని కామెడీ టైమింగ్‌ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. నాగ్‌, నానిల మధ్య వచ్చే సన్నివేశాలు వారి నటన, ఇద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ ఈ సినిమాను నడిపించింది. గత సినిమాలతో పోలిస్తే రష్మిక కు అంతగా ప్రాధాన్యం లేని పాత్ర దక్కిందనే చెప్పాలి. రష్మిక పాత్రకు సంబంధించి ఓ ట్విస్ట్‌ ఉన్నా, అది అంతంగా రక్తికట్టలేదు. ఆకాంక్ష సింగ్‌ పాత్ర.. రష్మిక పాత్ర కంటే మరీ చిన్నది. హీరోయిన్లు ఇద్దరూ అతిథి పాత్రల్లాగే కనిపిస్తారు. రావు రమేశ్‌, సత్య, నరేశ్‌, మురళీ శర్మలవి కూడా చిన్న పాత్రలే. ఈ సినిమాను రంగుల హరివిల్లులా తీర్చిదిద్దింది వైజయంతి మూవీస్‌. గత చిత్రాల్లాగే ఈ సినిమాలోనూ భారీతనం ఉట్టిపడింది. మణిశర్మ అందించిన పాటల్లో రెండు గీతాలు బాగున్నాయి. అన్ని పాటలను చిత్రీకరించిన విధానం బాగుంది. కథపరంగా ఎలాంటి మలుపులు లేని చిత్రం. కానీ, సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానంలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
చివరిగా…
‘దేవ.. దాస్‌’..ఇద్దరూ నవ్విస్తారు. అంతా వినోద‌మే.
రేటింగ్: ౩/5

345 total views, 1 views today