జుట్టు రాలిపోవుట మరియు చుండ్రు, మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే మెంతులను ఉపయోగించి ఉపశమనం పొందండి!

వర్షాకాలం మొదలైంది. మన మనస్సులు ఆహ్లాదకరమైన వానజల్లులను ప్రేమిస్తున్నప్పటికిని, మన జుట్టు మాత్రం, ఈ వాతావరణంతో పరస్పర విరుద్ధమైన ప్రేమ మరియు ద్వేష భావాలు రెండింటిని పంచుకుంటోంది. తడిగా మరియు తేమతో కూడిన ఈ వాతావరణంలో, మన జుట్టు పట్ల శ్రద్ధ వహించడం చాలా కఠినమైన పని.

వర్షాకాలం కనుక రాకపోతే, ఎండలకు విషపూరితంగా మారిన మీ చుట్టూ ఉండే వాతావరణం ప్రభావం వలన, మీ జుట్టు దెబ్బతిని చిక్కులతో, నిస్తేజంగా మరియు పొడిగా మారిపోతుంది. ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగించినా కూడా, తిరిగిరాని మీ జుట్టు యొక్క నాణ్యతను మీ చెంతకు చేర్చే ఉపాయం మీ వంటగదిలోనే ఉంది.

పూర్వ కాలం నుండి భారతదేశంలో, మెంతులను కేశ సంరక్షణలో భాగంగా ఉపయోగించడం కలదు. మెంతులలో సమృద్ధిగా ఉండే అత్యవసర పోషకాలు మరియు యాంటిఆక్సిడెంట్లు, మీ జుట్టుకు తేమను చేకూర్చి, నిస్తేజంగా మారిన కురులకు తిరిగి జీవం పోస్తాయి.

కేశ సంరక్షణకు మెంతులు ఏ విధంగా సహాయ పడతాయి?

మెంతులలో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ, విటమిన్ కే మరియు విటమిన్ సి వంటి విటమిన్లు, పొటాషియం, కాల్షియం మరియు ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో జుట్టు రాలడాన్ని మరియు చుండ్రుని నిరోధించడానికి, జుట్టు పొడిబారడం, బట్టతల మరియు జుట్టు పలుచబడటం వంటి వివిధ రకాల కేశ సమస్యల చికిత్సలు నిర్వహించడానికి అవసరమైన ప్రోటీన్లు మరియు నికోటినిక్ యాసిడ్ కూడా అధికంగా ఉంటాయి.

దీనిలో పెద్ద మొత్తంలో ఉండే లెసిథిన్, జుట్టుకు తేమనందించి జుట్టు కుదుళ్లను మరియు కేశాలను పటిష్ట పరచడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట నానబెట్టిన మెంతులను ప్రతిరోజు సేవించడం వలన జుట్టుకు మేలు చేకూరుతుందని అంటారు. మెంతి గింజలలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.

మీరు మెంతులను దైనందిన కేశ సంరక్షణ చర్యలలో భాగంగా ఎలా ఉపయోగించాలో, ఇప్పుడు తెలియజేయబోతున్నాము. .

1. జుట్టు రాలడాన్ని నివారించడానికి మెంతుల హెయిర్ మాస్క్

మీరు జుట్టు రాలడాన్ని అరికట్టే హెయిర్ మాస్క్ ను సులభంగా ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం!

నీటిలో 2 టేబుల్ స్పూన్ల మెంతులను వేసి, చల్లని ప్రదేశంలో ఉంచి, రాత్రంతా నానబెట్టండి. అదే నీటిని ఉపయోగించి విత్తనాలను శుభ్రంగా రుబ్బండి. జిగురుగా, అంటుకునేటట్లు ఉండే గోధుమ రంగు పేస్టు తయారవుతుంది. ఈ జిగురు వంటి పదార్ధమే, మీ జుట్టుకు కాంతినిస్తుంది. మీ జుట్టు యొక్క కుదుళ్లకు శుభ్రంగా రాసుకుని 20 నిముషాల పాటు వదిలివేయండి. తరువాత మీ జుట్టును మర్దన చేసుకుని, ఒక తేలికపాటి షాంపూతో శుభ్రపరచుకోండి. ఉత్తమ ఫలితాలు కోసం కనీసం వారానికి రెండుసార్లు ఇలా చేయాలి.

2. చుండ్రును అదుపులో ఉంచడం కొరకు మెంతుల మాస్క్
రాత్రంతా నీళ్ళలో, 3 టేబుల్ స్పూన్లు మెంతి గింజలను నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం నానిన మెంతి గింజలను బాగా ముద్దగా అయ్యేవరకు రుబ్బండి. ఇప్పుడు తాజా నిమ్మకాయను పిండి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, ఆ పేస్ట్ లో కలపాలి. మీ చేతితో ఈ పేస్ట్ ను జుట్టు మొదళ్ళు మరియు చివర్లకు రాసుకోండి. మీ జుట్టును 30 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత తేలికపాటి షాంపూ సహాయంతో, మీ జుట్టును శుభ్రం చేసుకోండి. ఈ మాస్కు మీ మాడు యొక్క ఆరోగ్యాన్ని పునరుద్ధరించి, చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
3. మృదువైన జుట్టు కోసం
మృదువైన మరియు మెరిసే జుట్టు కోసం ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పాలను పైన చెప్పిన మాస్కుకు కలపండి. ఈ మిశ్రమాన్ని, మీ జుట్టు మరియు మాడుకు ముని వేళ్ళతో రాసుకుని 20 నిముషాల పాటు ఆరనివ్వండి. తరువాత చల్లటి నీటితో మరియు తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.
గమనిక: అన్ని కిరాణా దుకాణాల్లోనూ మెంతులు సులభంగా లభిస్తాయి. ఒకవేళ మెంతులు దొరకకపోతే, మెండు పొడిని ఉపయోగించి కూడా పైన తెలిపిన మాస్కులు తయారు చేసుకోవచ్చు.

270 total views, 2 views today